Tuesday, 26 July 2011

జ్ఞాపకాల పొరలు

బాల్యంలోకి వెళితే కొంచెం కష్టాలు బోలెడంత ఆనందం గుర్తుకు వస్తున్నాయి.  మా నాన్నగారి ఉద్యోగరిత్యా వికారాబాద్ పక్కనే వున్న ఒక చిన్న రైల్వే స్టేషన్లో వుండేవాళ్ళం.  స్టేషన్లో వుండటమేంటి అంటే అంతే మరి, అక్కడ స్టేషన్, క్వార్టర్స్ తప్పించి ఇంకేమీ వుండేవి కావు.  కనీసం కరెంట్ కూడ వుండేది కాదు.  మాకున్న  ఎంటర్టయిన్మెంట్ అంటే తోటిపిల్లలతో ఆడుకోవటం, రేడియో వినటం మాత్రమే.  కాని ఎప్పుడు బోరు అంటే తెలియదు.  మా నాన్నగారు ఎక్ష్ సర్విస్ మెన్ కావడంతో బోలెడంత డిసిప్లిన్ వుండేది ఇంట్లో.  ఉదయం 5 గంటలకే నిద్ర లేవటం, చదువుకోవటం. తయారు అవ్వటం, మైలు దూరం వున్న స్కూల్ కి నడుచుకుంటూ వెళ్ళటం (బాక్స్ తో సహా), మళ్ళి సాయంత్రం 5 గంటలకి తిరిగి రావటం.  ఫ్రెష్ అయ్యి ఒక గంట ఆడుకోవటం (ఇది కూడా రూలే హొం వర్క్ ఎక్కువ వుందని ఎక్కొట్టటానికి లేదు).  రాత్రి 9 అయ్యేసరికి పడుకోవటం. ఆదివారం వస్తే ఈనాడు పేపర్ కొసం ఎదురు చూసి పోటాపోటీగా  చదివెయ్యటం.  ఇంతలో ముక్కుపుటాలు అదిరే వాసనలు రాగానే ఆకలి గుర్తుకు వచ్చేది.  ఆ తరువాత భుక్తాయాసం తో రేడియో పక్కన చేరి బాలానందం, నాటకం (ఒక్కోసారి సంక్షిప్త శబ్డ చిత్రం) వినటం, మళ్ళి ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఆటల్లో పదిపోవటం.  ఇలా వుండేవి రోజులు.  అయ్యో ఇంతేనా అనిపిస్తుంది ఇప్పుడు.  కాని అందులోనే ఎంత హేపీ గా వుండేవాళ్ళమో చెప్పలేను.  ఆ అనుభవాలు, సెలవలు వస్తే ఏమి చేసేవాళ్ళం అనేది మరో టపాలో.

ఎందుకీ రాతలు


తెలుగు బ్లాగు కదా తెలుగులోనే రాద్దామని ప్రయత్నం.  కానీ ఆది లోనే హంసపాదు అంటారు చూడండి అలా బ్లాగ్ అంటె తెలుగులో ఏమిటో తెలియదే.  పోనీ కనీసం కొన్ని పంక్తులైనా తెలుగే రాయడానికి ప్రయత్నం చేస్తాను.

అసలు ఈ రాతలెందుకంటే ఏదో ఖాళీగా ఉన్నాం కదా కాస్త జ్ఞాపకాల పుటలు తిరగేద్దామని ఒక ఆలోచన.  ఛిన్నప్పుడు నేను నా స్నేహితులతో పందెం కట్టి మరి అచ్చ్హ తెలుగు ఆట ఆడేదాన్ని.  అంటే ఎవరు ఎక్కువ సేపు ఆంగ్ల పదాలు వాడకుండ మాట్లాడుతారో అని పందెం అన్నమాట.  అది గుర్తుకు వచ్చ్హింది. చాలా సార్లు నేను నెగ్గేదాన్ని.  అన్నట్టు నేను పదవ తరగతిలో తెలుగులో మా పాఠశాలలో ప్రథమురాలిని (మా పాఠశాల పెరు ఇప్పుడు చెప్పలెనండి.  అంతా అబద్ధం అనుకుంటున్నరా, కాదండి, అది తెలుగులొ చెప్పటం కష్టం, వ్రతభంగం అవుతుంది.  ఇంకోసారి తప్పకుండా పరిచయం చేస్తాను గుంటూరులొని మా పాఠశాలని. నిజానికి నాకు ఆంగ్లమంటేనే ఎక్కువ ఇష్టంగ ఉండేది, కాని అదేంటో తెలుగులో మొదటి స్థానం వచ్చ్హింది.  చాలా కష్టంగ వుంది ఈ తెలుగు మాత్రమే రాయటం.  ప్రస్తుతానికి సరి.  మరోమారు తప్పక ప్రయత్నిస్తాను.


ఈ బ్లాగుల గురించి నాకు చాలా కాలం తెలియదు.  ఎప్పుడు ఆఫీసు, ఇల్లు, వంట సరిపోయేది.  ఈ మధ్యనే బొత్తిగా పని లేక నెట్ మీద పడ్డాను.  సరె ఈ బ్లాగుడు మనకి చిన్నప్పటి నుండి అలవాటే గదా (అంటే వాగడం అలవాటే గద) దాందేముంది బ్లాగేద్దాము అని సిద్ధం అయిపోయాను. అదన్నమాట.